Term Insurance: ఏ వయసులో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి? తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలివే..

Term Insurance: టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒక రకమైన జీవిత బీమా పాలసీ, ఇది కేవలం నిర్దిష్ట కాలానికి మాత్రమే కవరేజీని అందిస్తుంది. ఈ పాలసీదారుడు నిర్ణీత కాలం (టర్మ్) లో మరణిస్తే, అతని కుటుంబం లేదా నామినీకి మీరు తీసుకున్న భీమా కంపెనీ డెత్ బెనిఫిట్ ను చెల్లిస్తుంది. ఇది జీవిత బీమాలో అత్యంత సరసమైన, సులభమైన రకమని చెప్పవచ్చు, ఎందుకంటే ఇది కేవలం రక్షణకే పరిమితం అయి ఉంటుంది. మిగతా ఇన్సూరెన్స్ ప్లాన్లతో పోల్చితే, ఈ పాలసీ కేవలం రక్షణ కవచాన్ని మాత్రమే అందిస్తుంది, దీనివల్ల పొదుపు లేదా మదుపు (సేవింగ్స్ లేదా ఇన్వెస్ట్మెంట్) అవకాశాలు ఉండవు.

ఇన్సూరెన్స్ విషయానికి వచ్చేసరికి చాలా మంది సేవింగ్స్‌తో పాటు లైఫ్ కవర్ కలిగి ఉన్న వాటినే తీసుకోవడానికి మగ్గు చూపుతారు, ఎక్కువ ఖర్చు చేసి తక్కువ కవరేజీ తీసుకుంటారు కానీ, చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ కవరేజీ వచ్చే టర్మ్ పాలసీ లను నిర్లక్ష్యం చేస్తారు ఎందుకంటె మెచ్యూరిటీ సమయం భీమా దారుడు బ్రతికి ఉంటె భీమా కంపెనీ ఎటువంటి చెల్లింపు చేయదు అని. మనం ఖర్చు చేసేది చాల చిన్న మొత్తం అని గుర్తు పెట్టుకోవాలి, దురదృష్టవశాత్తు అనుకోని సంఘటన జరిగినపుడు ఈ పాలసీ నే మీ కుటుంబానికి కొండంత అండగా ఉంటుంది అని తెలుసుకోవాలి. ప్రీమియం రిటర్న్ పాలసీలు కంపెనీ లు ఇస్తాయి కానీ వాటి ప్రీమియం రెట్టింపు ఉంటుంది. దాదాపుగా 30 నుండి 40 సంవత్సరాలు పాటు టర్మ్ పాలసీ ను తీసుకుంటాం కనుక ఎక్కువ ఖర్చుతో ప్రీమియం రిటర్న్ పాలసీ తీసుకోపోవడమే మేలు.

మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఆలస్యం అయ్యేవరకు వేచి ఉండకండి, ఎందుకంటే మీరు ఎప్పుడూ వారి పక్కన ఉండలేకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో, టర్మ్ ప్లాన్ మీ కుటుంబానికి రక్షణగా నిలుస్తుంది. తక్కువ ప్రీమియంతో ఎక్కువ లైఫ్ కవర్ కోరుకునే వారికి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు అత్యుత్తమ ఎంపిక.

కవరేజీ ఎంత ఉండాలి?

మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, కుటుంబ అవసరాలు, అప్పులు, తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని, మీ జీవిత బీమా కవరేజీని ఎంచుకోవాలి. సాధారణంగా, వాటి ఆధారంగా మీ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పాలసీ కవరేజీ ఉండేలా చూసుకోవాలి. మీ వార్షిక ఆదాయానికి 10 నుండి 15 రెట్లు ఉన్న కవరేజీ సరిపోతుంది. ఈ మొత్తాన్ని పెంచడం ద్వారా కుటుంబానికి మరింత ఆర్థిక భద్రతను అందించవచ్చు. పాలసీ యొక్క ప్రయోజనాలు, ప్రీమియం, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ను పరిగణలోకి తీసుకొని ఎంచుకోవడం ఉత్తమం.

ప్రాక్టికల్ ఉదాహరణ

టర్మ్ పాలసీని మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి, ఒక ఉదాహరణ తీసుకుందాం. రమేష్ అనే వ్యక్తి ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందినవాడు. అతని వయసు 35 సంవత్సరాలు, అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రమేష్ వార్షిక ఆదాయం రూ. 6 లక్షలు. అతను రూ. 1 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్నాడు. అనుకోని కారణంగా రమేష్ మరణిస్తే, అతని కుటుంబానికి ఆ టర్మ్ ఇన్సూరెన్స్ కింద రూ. 1 కోటి అందుతుంది. ఇది రమేష్ లేకున్నా అతని కుటుంబాన్ని ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఎంతో సహాయపడుతుంది. పిల్లల చదువు, కుటుంబ అవసరాలు, గృహ రుణం వంటి ప్రధాన భాధ్యతలను తీర్చడానికి ఈ మొత్తం ఎంతో అవసరమవుతుంది. అతను జీవించి ఉన్నపుడు తీసుకున్న తెలివైన ఆలోచనే అతను లేని సమయం లో కూడా తన కుటుంబానికి రక్షణ అందిస్తుంది.

Term Insurance 1

టర్మ్ ఇన్సూరెన్స్ వల్ల ఉండే ప్రయోజనాలు

  1. తక్కువ వ్యయంతో అధిక కవరేజీ: టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు చాలా తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీని అందిస్తాయి. ఉదాహరణకు, మీరు సంవత్సరానికి కొన్ని వేల రూపాయలు మాత్రమే చెల్లించి, కోట్ల రూపాయల కవరేజీ పొందవచ్చు. ఇది ముఖ్యంగా కుటుంబ పోషణదారుల మరణం తర్వాత వారి కుటుంబాన్ని ఆర్థికంగా సురక్షితంగా ఉంచడానికి సహాయపడుతుంది.
  2. ఆర్థిక భద్రత: అనుకోని ప్రమాదంలో పాలసీదారుడు మరణిస్తే, టర్మ్ ఇన్సూరెన్స్ నామినీలకు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇది కుటుంబానికి వచ్చే ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది. పిల్లల విద్య, గృహ రుణం వంటి ప్రధాన ఆర్థిక బాధ్యతలను తగ్గించడానికి ఈ మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చు.
  3. అధునాతన రైడర్లు: నేడు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు వివిధ రకాల రైడర్లతో వస్తున్నాయి. ఈ రైడర్లు అనారోగ్య, ప్రమాద వలన శాశ్వత వైకల్యం, క్రిటికల్ ఇల్నెస్ వంటి అంశాలను కవరేజీ చేయగలవు. దీనివల్ల పాలసీదారుడు మరింత భద్రతా కవచాన్ని పొందగలడు.
  4. ఆన్‌లైన్ ఆప్షన్లు: చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు ఆన్‌లైన్‌లో టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను అందిస్తున్నాయి. ఈ ప్లాన్లు తక్కువ ఖర్చుతో, ఎక్కువ సౌకర్యాలతో ఉంటాయి. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం వల్ల మధ్యవర్తి కమీషన్లు తగ్గుతాయి, కాబట్టి ప్రీమియం మరింత తక్కువ అవుతుంది.

టర్మ్ ఇన్సూరెన్స్ పొందడానికి అర్హతలు

  • సాధారణంగా 18 నుండి 65 సంవత్సరాల మధ్య వయసున్న వారు టర్మ్ ఇన్సూరెన్స్ పొందవచ్చు. అయితే, ఎంత తక్కువ వయసులో పాలసీ తీసుకుంటే, అంత తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీని పొందవచ్చు.
  • మంచి ఆరోగ్యంగా ఉన్నవారు సులభంగా పాలసీ పొందవచ్చు. ఆరోగ్య పరీక్షలు అవసరమయ్యే అవకాశాలున్నప్పటికీ, చాలా సార్లు ఇది సాధారణంగా ఉంటాయి.
  • కొన్ని ప్రొఫెషన్లు ప్రమాదకర వృత్తులు (ఉదా: మైనింగ్, ఎలక్ట్రికల్ వర్క్స్) ఉండే వారికి పాలసీ ప్రీమియం ఎక్కువగా ఉండవచ్చు. ఇది వారి వృత్తిలో ఉన్న ప్రమాద స్థాయిని బట్టి నిర్ణయించబడుతుంది.
  • ఉద్యోగం చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు తమ ఇంటికి ఆదాయ మార్గంగా ఉన్న ప్రతి ఒక్కరు టర్మ్ పాలసీ తీసుకోవడానికి అర్హులు. అయితే ఉద్యోగులు తమ జీతం రసీదు లేదా బ్యాంకు స్టేట్మెంట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి మరియు బిజినెస్ చేసేవారు ITR తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఈ రెండు లేని వారు కూడా ఈ పాలసీ ను పొందవచ్చు కానీ కాస్త ఎక్కువ ప్రీమియం తో నిమిత్త మొత్తానికి (షుమారు రూ. 25 లక్షల వరకు) మాత్రమే ఈ టర్మ్ పాలసీ తీసుకోవడానికి అర్హులు.
terms conditions abstract concept illustration 335657 4920

టర్మ్ ఇన్సూరెన్స్ నియమ, నిబంధనలు

టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు, బీమా కంపెనీకి మీ పూర్తి వ్యక్తిగత వివరాలు, ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక స్థితి, మరియు మీరు ఇప్పటికే ఉన్న ఇతర బీమా పాలసీల వివరాలు కచ్చితంగా తెలియజేయాలి. ముఖ్యంగా, మీ ఆరోగ్య సమస్యలు, మీరు తీసుకుంటున్న మందులు, జీవనశైలి అలవాట్లు, వృత్తి మరియు తరచుగా విదేశాలకు చేసే ప్రయాణాలు వంటి అంశాలు నిజాయితీగా తెలియజేయాలి.

తప్పనిసరిగా, పాలసీ కింద ప్రయోజనం పొందే నామినీల వివరాలు మరియు ఇతర ప్రత్యేక పరిస్థితుల గురించి కూడా బీమా కంపెనీకి సమాచారం ఇవ్వాలి. ఈ వివరాలను సరైన విధంగా ఇవ్వడం ద్వారా మీ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ సక్రమంగా అమలులో ఉంటుందనే నమ్మకం కలిగించవచ్చు, భవిష్యత్తులో క్లెయిమ్ సమస్యలు ఎదురుకాకుండా ఉంటుంది.

ఏ కంపెనీ పాలసీ తీసుకోవాలి?

టర్మ్ పాలసీ ఎంపిక చేయడంలో ఏ కంపెనీ బెటర్ అనేది తెలుసుకోవడానికి, క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో, ప్రీమియం ధర, పాలసీ ఫీచర్లు, కస్టమర్ సపోర్ట్, స్పెషల్ బెనిఫిట్స్, కంపెనీ ఆర్థిక స్థితి వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ అందించే, మంచి క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో కలిగిన కంపెనీని ఎంచుకోవడం మంచిది.

Insurance Claim

క్లెయిమ్ చేసే విధానం

టర్మ్ పాలసీ క్లెయిమ్ చేయడం ఒక సులభమైన ప్రక్రియ, అయితే దానిని సరైన విధంగా చేయడం చాలా ముఖ్యం. పాలసీదారుడు మరణించిన తర్వాత, పాలసీ బెనిఫిషియరీ లేదా కుటుంబ సభ్యుడు బీమా కంపెనీకి క్లెయిమ్ రిజిస్టర్ చేయాలి. మొదట, పాలసీ నంబర్, మరణానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు (మరణ సర్టిఫికేట్), అలాగే పాలసీదారుడి ఇతర అవసరమైన డాక్యుమెంట్లు సేకరించాలి. ఈ డాక్యుమెంట్లతో పాటు కంపెనీకి క్లెయిమ్ ఫారం సమర్పించాలి. క్లెయిమ్ పరిశీలన అనంతరం, కచ్చితమైన వివరాలు అందిస్తే క్లెయిమ్ అనుమతించబడుతుంది. సాధారణంగా, బీమా కంపెనీలు 30 రోజుల లోపల క్లెయిమ్ ప్రాసెస్ చేసి, నామినీకి పేమెంట్ చేస్తాయి. ప్రాసెస్ వేగవంతంగా జరగడానికి డాక్యుమెంట్లు సరిగ్గా సమర్పించడం అవసరం.

క్లెయిమ్ అందించే సమయంలో, కంపెనీలు అన్ని వివరాలను గమనించి క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. 2015లో ఇన్సూరెన్స్ చట్టంలో చేసిన సవరణల ప్రకారం, కంపెనీలకు పాలసీదారుల సమాచారాన్ని పాలసీ తీసుకున్న మొదటి మూడేళ్లలో తనిఖీ చేయడానికి సమయం ఉంటుంది. ఈ మూడు సంవత్సరాల లోపు, పాలసీదారుల వివరాల్లో ఏమైనా విభేదాలు ఉంటే, కంపెనీ ఆ పాలసీని రద్దు చేయవచ్చు. కానీ మూడు సంవత్సరాలు పూర్తయిన తర్వాత, పాలసీ రద్దు చేసే హక్కు కంపెనీకి ఉండదు, అప్పటి వరకు రద్దు చేయాలంటే, పాలసీదారు ఉద్దేశపూర్వకంగా మోసం చేశారని నిరూపించాలి.అందువలన 3 ఏళ్ళు దాటిన తరువాత చేసే క్లెయిమ్స్ కు ఎటువంటి అడ్డంకి లేకుండా కచ్చితంగా నామినీకి చెల్లింపు చేయవలసి ఉంటుంది.

టర్మ్ ఇన్సూరెన్స్ పై ఉండే అపోహలు

  1. పాలసీ రీఫండ్ లభించదు: టర్మ్ ఇన్సూరెన్స్‌లో ప్రీమియం తిరిగి రాదు అని అనుకుంటూ చాలామంది ఈ పాలసీని తీసుకోవడంలో వెనుకడుగు వేస్తారు. కానీ, ప్రస్తుతం కొన్ని ప్లాన్లలో ‘రిటర్న్ ఆఫ్ ప్రీమియం’ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఇది పాలసీ వద్దనుకున్నపుడు లేదా మెచ్యూరిటీ సమయంలో పాలసీ దారుడు జీవించి ఉంటె చెల్లించిన ప్రీమియాన్ని తిరిగి పొందే అవకాశం ఇస్తుంది.
  2. సమయం గడిచిన తర్వాత ప్రీమియం పెరుగుతుంది: చాలా మంది అనుకుంటారు, టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాలక్రమంలో పెరుగుతుందని. కానీ, ఇది నిజం కాదు. పాలసీని కొనుగోలు చేసే సమయంలోనే ప్రీమియం ఫిక్స్ అవుతుంది, తరువాత కాలంలో అది మారదు.
  3. టర్మ్ ఇన్సూరెన్స్ ఎవరికి పనికిరాదు: కొందరు అనుకుంటారు, ఇది ఒక నిరుపయోగమైన పాలసీ అని. కానీ నిజంగా, ఇది ప్రతి కుటుంబానికి అవసరమైన జీవిత రక్షణ పాలసీ. ఇది ముఖ్యంగా మధ్యతరగతి, తక్కువ ఆదాయ వర్గాలకు మరియు కుటుంబం మీద బాధ్యతగా ఉన్నవారికి ముఖ్యంగా అవసరం.

ముగింపు

టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి కుటుంబానికి అవసరమైన జీవిత రక్షణ ప్రోడక్ట్. దీని వల్ల కుటుంబం భవిష్యత్తులో రక్షణ పొందే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ తమ కుటుంబాన్ని సురక్షితంగా ఉంచడానికి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పటికీ ఈ నిర్ణయం తీసుకోకపోయిన వారైతే, వెంటనే తమ కుటుంబ భద్రత కోసం టర్మ్ ఇన్సూరెన్స్ పై పునర్విచారణ చేయడం మంచిది.

WhatsApp Channel Follow Now