బీమా(Insurance) అంటే భయం ఎందుకు?

మన దేశంలో చాలామంది భీమా (Insurance) అనేది ఒక తెలివితక్కువ ఆలోచన, దానికి ఎందుకు ప్రీమియం రూపంలో అనవసరపు ఖర్చులు పెంచుకోవడం అని తెలివిగా ఆలోచిస్తున్నాం అని భావిస్తారు. ఎందుకంటే నిజానికి చాలా మందికి బీమా అంటే ఏంటో, దాని ప్రాముఖ్యత గురించి పూర్తి అవగాహన లేదు. తగిన సమాచారం లేకపోవడం వల్ల బీమా కొనుగోలు చేయడం అనవసరంగా భావిస్తారు. బీమా కేవలం వ్యర్ధం అని, ప్రీమియం కడుతున్నా ఎటువంటి ఉపయోగం ఉండదని అనుకునే భ్రమలు చాలా మందిలో ఉన్నాయి. కొందరు తమకు ఏమీ జరగదని భావించి, బీమా అవసరం లేదని నిర్ణయించుకుంటారు.

ఇతర దేశాలతో పోలిస్తే, ఇండియాలో ఇంటి బీమా ప్రాధాన్యత చాలా తక్కువగా ఉంది. దీనికి పలు కారణాలు ఉన్నాయి. బీమా పట్ల భయం చాలా మందిలో ఒక ప్రధాన సమస్యగా నిలిచింది. ఈ భయం పలు కారణాల వల్ల ఉద్భవిస్తుంది. ముఖ్యంగా, బీమా అంటే ఏంటో, దాని ప్రాముఖ్యత ఏమిటో అర్థం చేసుకోవడంలో ప్రజలకు తగిన సమాచారం లేకపోవడం వల్ల బీమా కొనుగోలు చేయడం అనవసరంగా భావిస్తారు.

ఇక్కడ రెండు ముఖ్యమైన బీమా రకాల గురించి ప్రస్తావించవచ్చు, అవి టర్మ్ బీమా మరియు ఆరోగ్య బీమా:

  1. టర్మ్ బీమా(Term Insurance) అంటే ఒక నిర్దిష్ట కాలానికి జీవిత రక్షణ అందించే బీమా పథకం. ఉదాహరణకు, ఒక మధ్యతరగతి కుటుంబాన్ని పోషిస్తున్న వ్యక్తి, అనుకోని సంఘటనల్లో దురదృష్టవశాత్తు ఏమైనా జరిగిన తన కుటుంబం ఆర్థికంగా సురక్షితంగా ఉండాలని భావిస్తాడు. అందుకే, అతను టర్మ్ బీమా తీసుకోవాలి. ఇది తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణను అందిస్తుంది. చిన్న ప్రీమియం తో తీసుకున్న టర్మ్ బీమా తన ఫ్యామిలీకి అండగా ఉంటుంది. కానీ మనలో చాలా మందికి దీనిపై పూర్తీ అవగానే లేదు, మరియు మనం లేనపుడు మన కుటుంబానికి రక్షణ కల్పించే పెద్ద మొత్తానికి చిన్నపాటి ప్రీమియం కూడా చెల్లించడానికి ఆలోచిస్తాము.
  2. ఆరోగ్య బీమా(Health Insurance) గురించి మాట్లాడితే, ఒక వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు అనుకుంటే, అతని వైద్య ఖర్చులు తీరడం అతనికి చాలా కష్టం అవుతుంది. ఆరోగ్య సమస్యలు ఎప్పుడు చెప్పి రావు, అవి వచ్చినపుడు డబ్బు చేతిలో ఉండదు, అప్పులు కోసం వెతుకుతాం. స్నేహితులు కానీ, అయినవాళ్లు కానీ ఎవరు సమయానికి సహాయం చేయరు. అదే అతను ఆరోగ్య బీమా తీసుకొని ఉంటె, అతని వైద్య ఖర్చులు మొత్తం బీమా కవరేజ్ ద్వారా తీర్చుకోవచ్చు. కానీ మనం రోజువారీ ఖర్చులలో చాల చిన్న భాగం ఆరోగ్య భీమా కి ఖర్చు చేస్తే కష్టసమయం లో మనల్ని ఆదుకుంటుంది అని గ్రహించలేకపోతున్నాం.
  3. గృహ భీమా(Home Insurance) విషయానికి వస్తే సొంత ఇంటి కల ప్రతి ఒక్కరికి ఉంటుంది, మరియు చాలా మంది ఆ కలను నెరవేర్చుకుంటారు కూడా, కానీ ఆ ఇంటికి గృహ భీమా మటికి చేయరు, దాని ప్రాముఖ్యత తెలియదు. ఎందుకంటె ప్రజలకు గృహ బీమా గురించి అవగాహన ఉండదు లేదా అనవసర ఖర్చు అని భావించవచ్చు. కొందరు అయితే తమ ఇంటిని బీమా చేయకుండా, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రం పశ్చాత్తాపం పడతారు.

Insurance policy

ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో భీమా శాతం తక్కువగా ఉండటానికి గల కారణాలు:

  • ప్రజలలో బీమా పట్ల ఉన్న భయానికి ముఖ్య కారణం భ్రమలు మరియు అపోహలు. వారు ప్రీమియమ్స్ కడితేనే పేమెంట్ పొందుతారనుకుంటారు, క్లెయిమ్ చేసేటప్పుడు సమస్యలు ఎదురవుతాయని ఆందోళన చెందుతారు. ఎందుకంటే తమ స్నేహితులు చెప్పిన అనుభవాల వలన బీమా క్లెయిమ్ చేసే సమయంలో వచ్చే సమస్యలు గురించి తెలుసుకుని భీమా తీసుకోవడం వల్ల ఎటువంటి ఫలితం ఉండకపోవచ్చు అని అనుకునే ప్రమాదం ఉంది. మరియు బీమా ప్రీమియమ్స్ కడుతున్న మధ్యలో డబ్బు అవసరం పడితే ఆ డబ్బు పొందగలమా లేదా అనేది తేలికగా ఊహించుకోలేకపోతారు.
  • ఆర్థిక ఆందోళనలు కూడా ప్రజలు బీమా తీసుకోవడం గురించి ఎందుకు భయపడుతున్నారనే ప్రశ్నకు ముఖ్యమైన కారణంగా నిలుస్తాయి. భారతదేశంలో చాలా మంది ప్రాథమిక అవసరాలకే తమ ఆదాయాన్ని ఖర్చు చేయడం వల్ల బీమా ప్రీమియమ్స్ కట్టడానికి తగినంత ఆర్థిక సామర్థ్యం లేకపోవడం సాధారణంగా కనిపిస్తుంది. ఒక మధ్యతరగతి కుటుంబం వారి వారపు ఆదాయాన్ని ఖర్చు చేయడం వల్ల, ఆరోగ్య బీమా లేదా జీవన రక్షణ బీమా తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. బీమా ప్రీమియమ్స్ కడుతూ ఉండడం వల్ల నెలవారీ ఖర్చులు పెరిగి, అది వారి జీవనశైలిపై ప్రభావం చూపవచ్చు అని భావిస్తారు.
  • భారతదేశంలో బీమా పట్ల భయానికి మరొక ముఖ్య కారణం ప్రజలు ప్రభుత్వ పథకాలు మరియు సంక్షేమ పథకాలపై ఎక్కువగా ఆధారపడటం. చాలా మంది తమ ఆరోగ్యాన్ని సంరక్షించడానికి లేదా ఆపదలకు రక్షణ పొందడానికి ప్రభుత్వ పథకాలు మరియు హాస్పిటల్ సౌకర్యాల మీద ఆధారపడతారు. ఆరోగ్య బీమా గురించి ఆలోచించే సమయానికి, ప్రభుత్వ హాస్పిటల్ సేవలు మరియు ఆరోగ్య బీమా పథకాల గురించి తెలుసుకుంటారు కానీ, వ్యక్తిగత బీమా తీసుకోవడం గురించి ఆలోచించరు.
  • అవినీతి మరియు మోసాలు కూడా బీమా పట్ల భయం కలిగించే అంశాలలో ఒకటి. భీమా ఏజంట్లు పూర్తి సమాచారం ఇవ్వకుండా భీమా చేయించండం లేదా కొన్నిసార్లు బీమా కంపెనీలు క్లెయిమ్ పద్ధతులను కఠినంగా ఉన్నందున లేదా అవినీతి కారణంగా క్లెయిమ్ పేమెంట్ ఆలస్యం అవుతుండటం కూడా మరొక కారణం. ఉదాహరణకి కారు బీమా క్లెయిమ్ చేసేటప్పుడు, కంపెనీ నుండి నష్టపరిహారం పొందడంలో అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశం లేకపోలేదు. ఈ అనుభవం వలన క్లెయిమ్ సమయంలో అసహనం చెందటం వల్ల అతను బీమా కంపెనీలను నమ్మలేకపోతాడు, ఇలాంటి ఉదాహరణల ద్వారా ఇతరులు కూడా బీమా కొనుగోలు చేయడంలో భయం కలిగి ఉంటారు.

బీమా కొనుగోలుదారుల సంఖ్యను పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలు:

  1. బీమా కొనుగోలుదారుల సంఖ్యను పెంచడానికి పలు చర్యలు తీసుకోవాలి. మొదట ప్రభుత్వం ప్రజల్లో బీమా గురించి అవగాహన పెంచే ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి. బీమా యొక్క ప్రాముఖ్యత, దాని ఉపయోగాలు గురించి స్పష్టంగా వివరించాలి. బీమా ఎజెంట్ తన అనుభవాలను పంచుకుంటూ, బీమా ప్రాముఖ్యతను ప్రజలకు వివరించగలిగితే, ప్రజలు బీమా కొనుగోలు చేయడానికి ముందడుగు వేస్తారు. అలాగే, బీమా క్లెయిమ్ పద్ధతులను సులభతరం చేసి, మోసాలకు అడ్డుకట్ట వేయడం ద్వారా ప్రజలు బీమా మీద నమ్మకం పెంచుకోవచ్చు. దీనివల్ల ప్రజలు బీమా తీసుకోవడానికి మోటివేట్ అవుతారు.
  2. బీమా పట్ల ప్రజల్లో భయాన్ని తొలగించడానికి ప్రభుత్వం మరియు బీమా కంపెనీలు కలిసి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. గతంలో బీమా తీసుకున్న వారికి సానుకూల అనుభవాలు అందించే విధంగా పథకాలు రూపొందించడం ద్వారా, ప్రజలు బీమా మీద నమ్మకం పెంచుకుంటారు. బీమా కంపెనీలు తమ కస్టమర్లకు సులభమైన క్లెయిమ్ పద్ధతులు అందించడం ద్వారా, కొత్త కస్టమర్లు కూడా బీమా తీసుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఈ రకంగా సేవలు అందించడం ద్వారా, ఆర్థిక భద్రత మరియు సంక్షేమం పెరుగుతుంది.
  3. ప్రతి పౌరుడికి జీవించే హక్కు మన రాజ్యాంగం కల్పించింది, కానీ దానిని ప్రభుత్వాలు కష్టతరం చేసాయి అన్నది వాస్తవం. ఎందుకంటే మన దేశంలో అన్ని రకాల భీమాల మీద పన్ను అధికంగా ఉంది, ఈ కారణంగా భీమా యొక్క ప్రీమియం అధికం అవుతుంది. కోవిడ్-19 తరువాత మన దేశంలో భీమాల మీద కొంత శాతం వరకు అవగాహన పెరిగింది, కానీ ప్రీమియం ఎక్కువగా ఉండటం వల్ల భీమా పొందటం లో ప్రజలు వెనకడుగు వేస్తున్నారు. తద్వారా దేశీయంగా జీవిత లేదా ఆర్యోగ్య భీమా లేని వారి సంఖ్య చాలా ఎక్కువ మొత్తం లో ఉంది. ప్రస్తుతం భీమా పై పన్ను 18% గా ఉంది. అందుకే బీమాపై ప్రస్తుతం ఉన్న 18% శాతం పన్నుని 5% కి తగ్గింపు లేదా పూర్తిగా పన్ను తీసివేసే ఆలోచన ప్రభుత్వం చేయాలి. అందువల్ల ఎక్కువమందికి భీమా తీసుకునేలా ప్రయోజనం కలుగుతుంది.
  4. ప్రతి ఒక్కరి జీవితానికి ఇల్లు, బట్ట, తిండి మాత్రమే ప్రాథమిక అవసరాలుగా భావిస్తారు, కానీ ఈ ఆధునీక యుగంలో భీమా (ఇన్సూరెన్స్) అనేది నాల్గవ కొత్త ప్రాథమిక అవసరం అని గుర్తించాలి. ఎందుకంటే కష్ట సమయంలో మనల్ని ఆదుకునేది భీమా అని తెలుసుకోవాలి.
  5. తక్కువ ఆదాయ వర్గాల వారికి సబ్సిడీలు అందించడం ద్వారా వారు కూడా బీమా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. అందుచేత భీమా తీసుకునే వారి శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది.

మొత్తంగా చెప్పాలంటే, బీమా పట్ల ప్రజల భయాన్ని తగ్గించడం అనేది ఒక ముఖ్యమైన అంశం. బీమా గురించి పూర్తి అవగాహన కల్పించడం, సులభమైన క్లెయిమ్ పద్ధతులు, మరియు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం లేదా పన్ను తగ్గింపు అందించడం ద్వారా, భారతదేశంలో బీమా కొనుగోలుదారుల సంఖ్యను పెంచవచ్చు. ఈ విధంగా భారతదేశం కూడా ఇతర దేశాలతో సమానంగా బీమా సేవలను ప్రజలందరికి అందించి భీమా రంగం వృద్ధి చెందేలా చేయొచ్చు.

WhatsApp Channel Follow Now