Credit Card: ఈరోజుల్లో, క్రెడిట్ కార్డ్స్ అనేవి మన జీవనశైలిలో ముఖ్యమైన భాగముగా మారిపోయాయి. ఎమర్జెన్సీ సమయంలో లేదా కొన్నిసార్లు కొన్ని ముఖ్యమైన కొనుగోళ్ల కోసం మనం క్రెడిట్ కార్డ్స్‌ను వాడుతుంటాం. కొన్ని సందర్భాల్లో, మనకు అందుబాటులో ఉన్న క్రెడిట్ లిమిట్‌ని నేరుగా మన బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటాం. ఈ ఆర్టికల్‌లో, మనం క్రెడిట్ కార్డ్ నుండి బ్యాంక్ ఖాతాకు డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం ఎలా? మరియు క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసే మార్గాలు గురించి తెలుసుకుందాం.
మొదట మీరు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, క్రెడిట్ కార్డు యొక్క ప్రధాన లక్ష్యం నేరుగా చెల్లింపులను చేయడం. పదేపదే డబ్బును బదిలీ చేయడం ద్వారా, మీరు క్రెడిట్ కార్డు యొక్క సద్వినియోగం చేయలేరు. దానిని షాపింగ్ కోసం ఉపయోగించలేరు, రివార్డ్ పాయింట్లను కూడా సంపాదించలేరు. మరొక విషయం ఏమిటంటే, మీరు క్రెడిట్ కార్డు పరిమితిని అధిగమిస్తే, ఆదాయపు పన్ను శాఖ మీ లావాదేవీలను పర్యవేక్షించే అవకాశం ఉంది. క్రెడిట్ కార్డులపై సంవత్సరానికి రూ. 2 లక్షలకు పైగా ఖర్చు చేసే వ్యక్తుల వివరాలను బ్యాంకులు ఆదాయపు పన్ను శాఖకు పంపిస్తాయి. తరచుగా డబ్బు బదిలీ చేయడం పన్ను అధికారుల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉందని గుర్తుంచుకోండి.
నెట్ బ్యాంకింగ్ ద్వారా డైరెక్ట్ ట్రాన్స్ఫర్
చాలా బ్యాంకులు వారి ఆన్లైన్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఈ ఎంపికను అందిస్తాయి. కాస్త ఎక్కువ ఛార్జీలు ఉండొచ్చు, కానీ ఈ పద్ధతి ద్వారా మీ ఖాతాకు తక్షణమే డబ్బు చేరుతుంది.
- మీ నెట్ బ్యాంకింగ్ ఖాతాలో లాగిన్ అవ్వండి.
- క్రెడిట్ కార్డు విభాగానికి వెళ్లండి.
- ‘ఫండ్స్ ట్రాన్స్ఫర్’ లేదా ‘క్యాష్ అడ్వాన్స్’ ఎంపికను ఎంచుకోండి.
- కావలసిన మొత్తం మరియు మీ బ్యాంక్ ఖాతా వివరాలను నమోదు చేయండి.
- లావాదేవీని ధృవీకరించండి.
పేమెంట్ యాప్స్ ద్వారా
క్రెడిట్ కార్డు నుండి బ్యాంకు ఖాతాకు డబ్బు బదిలీ చేయడానికి ఉపయోగించదగిన పేమెంట్ యాప్స్ కొన్ని ఉన్నాయి
- పేమెంట్ యాప్స్ అయిన PhonePe, Paytm, Amazon Pay, Google Pay, Cred APP ద్వారా మీ క్రెడిట్ కార్డును లింక్ చేసి, మీ బ్యాంక్ ఖాతాకు నేరుగా డబ్బు పంపవచ్చు.
- అయితే, ఈ పేమెంట్ యాప్స్ లావాదేవీ ఛార్జీలు వసూలు చేస్తాయి.
- పేమెంట్ యాప్‌ల ద్వారా మీరు నేరుగా క్రెడిట్ కార్డ్ నుండి బ్యాంక్ ఖాతాకు డబ్బును ట్రాన్స్ఫర్ చేయడం కొంచెం సులభమైన విధానం.
- ఈ బదిలీ కోసం విశ్వసనీయమైన ప్లాట్‌ఫారమ్‌లను మాత్రమే ఎంచుకోవాలి.
ఫోన్ బ్యాంకింగ్ ద్వారా
- మీ వద్ద ఇంటర్నెట్ లేకపోతే, మీరు మీ క్రెడిట్ కార్డు కస్టమర్ కేర్‌కు కాల్ చేయవచ్చు.
- క్రెడిట్ కార్డు కంపెనీని సంప్రదించి, మీ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయమని అభ్యర్థించండి.
- అవసరమైన వివరాలు, డబ్బు మరియు ఖాతా నంబర్ అందించండి.
ఏటీఎం ద్వారా కాష్ అడ్వాన్స్ (Cash Advance)
- కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డ్ యూజర్లకు కాష్ అడ్వాన్స్ సదుపాయాన్ని ఇస్తాయి. ఈ కాష్ అడ్వాన్స్ ద్వారా మీరు మీ క్రెడిట్ కార్డు నుండి డబ్బును ఏటీఎం(ATM) ద్వారా తీసుకోవచ్చు లేదా మీ బ్యాంక్ ఖాతాకు జమ చేసుకోవచ్చు.
- కాష్ అడ్వాన్స్ కోసం అధిక వడ్డీ రేట్లు ఉండొచ్చు మరియు కనీసంగా కొన్ని ఛార్జీలు కూడా ఉండొచ్చు.
- ప్రస్తుత రోజుల్లో కొన్ని కంపెనీ లు తమ కస్టమర్స్ కోసం ప్రీమియం కార్డ్స్ ను అందుబాటులోకి తెచ్చాయి, ఈ క్రెడిట్ కార్డ్స్ ద్వారా ఎటువంటి చార్జీలు లేకుండా ఏటీఎం(ATM) నుండి డబ్బు తీసుకునే సదుపాయం అందిస్తున్నాయి. అందుచేత మీ కార్డు ఫీచర్స్ గురించి తెలుసుకోండి.
బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ద్వారా
బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా మీ క్రెడిట్ కార్డు బిల్లులు సులభంగా చెల్లించవచ్చు మరియు మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరచవచ్చు.
- క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అనేది మీరు ఒక క్రెడిట్ కార్డ్ నుండి మరొక క్రెడిట్ కార్డుకు డబ్బును ట్రాన్స్ఫర్ చేయడం.
- బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి, మీరు ఎంచుకున్న కార్డ్‌కి చెందిన వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఛార్జీలు మొదలైన వాటి గురించి తెలుసుకోవడం అవసరం. ఆ కార్డు తక్కువ వడ్డీ రేటును అందిస్తే ఇది లాభదాయకం.
- మీ ఎందుకున్న క్రెడిట్ కార్డుతో మీ బ్యాలెన్స్‌ని ట్రాన్స్ఫర్ చేయడానికి, ఆ యొక్క క్రెడిట్ కార్డ్ కంపెనీకి అప్లై చేయాలి. దానితో పాటు, మీరు ట్రాన్స్ఫర్ చేయదలచిన మొత్తం, మీరు ట్రాన్స్ఫర్ చేయదలుచుకున్న క్రెడిట్ కార్డు వివరాలు ఇవ్వాలి.
- బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ పూర్తవడానికి 3 నుండి 5 రోజులు పడవచ్చు. అయితే, కొన్ని క్రెడిట్ కార్డ్ కంపెనీలు తక్షణమే బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ను అందిస్తాయి.
ప్రతికూలతలు
క్రెడిట్ కార్డ్ నుండి బ్యాంక్ ఖాతాకు డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయడం ఆర్థిక ఒత్తిడిని తగ్గించవచ్చు, కానీ ఇవి కొన్ని ప్రతికూలతలను కలిగి ఉంటాయి. ప్రధానంగా, ఈ పద్ధతులకు అధిక ప్రాసెసింగ్ ఫీజులు, వడ్డీ రేట్లు ఉండవచ్చు, ఇవి అప్పు భారాన్ని పెంచుతాయి. కాష్ అడ్వాన్స్ లేదా బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ సమయంలో సకాలంలో చెల్లింపులు చేయకపోతే, అధిక వడ్డీ రేట్లు, ఆలస్యపు ఫీజులు చెల్లించవలసి రావచ్చు. ఈ నిర్ణయాలను తీసుకునే ముందు ప్రతికూలతలను జాగ్రత్తగా పరిగణలోకి తీసుకోవడం అవసరం.
గమనిక: క్రెడిట్ కార్డ్ నుండి బ్యాంక్ ఖాతాకు డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం చాలా సులభమైన ప్రక్రియ, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయడం కూడా ఒక ఉత్తమమైన ఎంపిక, కానీ ఇది అలవాటుగా మార్చుకోకండి. ఎక్కువ సార్లు ఈ విధంగా బదిలీలు మీకు సమస్యలను కలిగించవచ్చు. అందువల్ల, క్రెడిట్ కార్డును జాగ్రత్తగా, తెలివిగా వాడటం చాలా అవసరం.