Mutual Funds: రాజు అనే నా స్నేహితుడు రోజువారి జీవితంలో ఎన్నో ఖర్చులను చేస్తూ ఉంటాడు. మంచి రెస్టారెంట్‌లో భోజనం చేయడం, కొత్త గాడ్జెట్‌లు కొనడం, ప్రతి సంవత్సరం రెండు మూడు ట్రిప్స్ ప్లాన్ చేసుకోవడం… ఇలా అనేక ఖర్చులు చేస్తూ ఉంటాడు. కానీ, ఒకరోజు అనుకుంటున్నాడు – “ఈ ఖర్చులు కొంచెం తగ్గించి పొదుపు చేయగలనా?”
అప్పుడు నేను అతనికి మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్పాను. “స్వల్ప కాలానికి తక్కువ రిస్క్‌తో, దీర్ఘకాలానికి మంచి లాభాల కోసం మ్యూచువల్ ఫండ్స్ చాలా బాగుంటాయి” అని చెప్పాను. మరి, Mutual Funds అంటే ఏమిటి? వాటి రకాలు ఏమిటి? మ్యూచువల్ ఫండ్స్ మనకు ఎలా ఉపయోగపడతాయి?” అని అడిగాడు. ఇదే ప్రశ్న మనలో చాలా మందికి ఉంటుంది. అందుకే వాటి గురించి తెలుసుకుందాం!
Mutual Funds అంటే ఏమిటి?
సాధారణంగా, మనం మనమే నేరుగా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం చాలా కష్టమైన పని. మార్కెట్ గురించి అవగాహన, క్షణక్షణం మారే ట్రెండ్స్ గురించి తెలుసుకోవడం, సరైన షేర్లను ఎంపిక చేయడం… ఇవన్నీ చాలా కష్టమైన పనులే! అందుకే, మ్యూచువల్ ఫండ్స్ మనకు సహాయం చేస్తాయి.
మ్యూచువల్ ఫండ్ అనేది పలు పెట్టుబడిదారుల డబ్బును కలిసి, నిపుణులు నిర్వహించే పెట్టుబడి పథకం. ఇది స్టాక్స్, బాండ్స్, డెబెంచర్లు, ఇతర ఆస్తులలో పెట్టుబడి పెడుతుంది. వృద్ధి, ఆదాయ అవకాశాలను బట్టి Mutual Funds రకాలు మారుతూ ఉంటాయి.
ఉదాహరణ: మనకు ఎక్కువగా తెలిసిన ఒక మ్యూటువల్ ఫండ్ ఉదాహరణగా తీసుకుందాం, SBI మాగ్నమ్ మిడ్‌క్యాప్ ఫండ్. ఈ ఫండ్ ప్రధానంగా మధ్య తరగతి కంపెనీల స్టాక్స్‌లో పెట్టుబడి చేస్తుంది. మిడ్‌క్యాప్ కంపెనీలు పెద్ద పరిమాణంలో కాకుండా, స్థిరమైన వృద్ధి సాధించే సామర్థ్యం కలిగి ఉంటాయి.
మీరు SBI మాగ్నమ్ మిడ్‌క్యాప్ ఫండ్‌లో 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడితే, ఈ డబ్బు బాగా పెరిగే మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో వెనుకగా పెట్టుబడి చేస్తుంది. ఒక సంవత్సరానికి మీరు 15% లాభం పొందితే, మీ పెట్టుబడి 1,00,000 రూపాయల నుంచి 1,15,000 రూపాయలకు పెరుగుతుంది.
ప్రతి నెల మీ పెట్టుబడి ఎంత returns ఇస్తుందో తెలుసుకోవాలంటే SIP క్యాల్కులేటర్ ను ఇక్కడ క్లిక్ చేయండి
Mutual Fund కేటగిరీలు
Mutual Funds విభిన్నంగా పలు రకాలుగా విభజించబడ్డాయి, మరియు వాటి లాభాలు, రిస్క్ లెవల్స్ మరియు పెట్టుబడి కాలం ఆధారంగా వేర్వేరు కేటగిరీలుగా పరిగణించవచ్చు.
1. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (Equity Funds)
ఈక్విటీ ఫండ్లు ప్రధానంగా స్టాక్స్‌లో పెట్టుబడి పెడతాయి. వీటిలో పెట్టుబడి పెడితే ఎక్కువ రిస్క్ ఉంటుందనే విషయం గమనించాలి, కానీ దీర్ఘకాలంలో ఎక్కువ రాబడిని ఆశించవచ్చు,
- లార్జ్ క్యాప్ ఫండ్స్: పెద్ద, స్థిరమైన కంపెనీల్లో పెట్టుబడి పెడతాయి. రిస్క్ తక్కువగా, స్థిరమైన రాబడిని అందిస్తాయి.
- మిడ్ క్యాప్ ఫండ్స్: మధ్య తరహా కంపెనీల్లో పెట్టుబడి పెడతాయి. రాబడి మోస్తరు, కానీ రిస్క్ కొంత ఎక్కువ.
- స్మాల్ క్యాప్ ఫండ్స్: చిన్న కంపెనీలలో పెట్టుబడి పెడతాయి. ఎక్కువ రాబడి అవకాశం, కానీ రిస్క్ కూడా అధికం.
- ఎల్ఎస్ఈ (ELSS – Tax Saving Funds): టాక్స్ ఆదా చేసుకోవడానికి ఉపయోగపడే ఈక్విటీ ఫండ్. లాక్-ఇన్ పీరియడ్ 3 సంవత్సరాలు ఉంటుంది.
2. డెట్ మ్యూచువల్ ఫండ్స్ (Debt Funds)
డెట్ ఫండ్లు ప్రధానంగా ప్రభుత్వ బాండ్లు, కార్పొరేట్ బాండ్లు మరియు ఇతర స్థిరమైన ఆదాయ పెట్టుబడులు వంటి డెట్ ఇన్స్ట్రుమెంట్లలో పెట్టుబడి పెడతాయి. ఇవి తక్కువ రిస్క్‌తో కూడిన ఫండ్స్ కావడం వల్ల, స్థిరమైన ఆదాయాన్ని అందిస్తాయి.
- లిక్విడ్ ఫండ్స్: షార్ట్ టర్మ్ లో అధిక లిక్విడిటీ అవసరమయ్యే వారి కోసం. తక్కువ రిస్క్, తక్కువ రాబడి.
- కార్పొరేట్ బాండ్ ఫండ్స్: కార్పొరేట్ బాండ్లలో పెట్టుబడి పెడతాయి, మంచి స్థిరమైన ఆదాయాన్ని అందిస్తాయి.
- డైనమిక్ బాండ్ ఫండ్స్: మార్కెట్ పరిస్థితుల ఆధారంగా(వడ్డీ రేట్ల మార్పులను బట్టి) బాండ్లలో పెట్టుబడులను మారుస్తాయి.
3. హైబ్రిడ్ ఫండ్స్ (Hybrid Funds)
హైబ్రిడ్ ఫండ్లు స్టాక్స్ మరియు బాండ్లలో మిశ్రమంగా పెట్టుబడులను పెట్టడం ద్వారా, రిస్క్ మరియు రాబడిని బ్యాలెన్స్ చేస్తాయి.
- బాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్: మార్కెట్ పరిస్థితులను బట్టి స్టాక్ మరియు బాండ్ల మధ్య సమానంగా పెట్టుబడులను విభజిస్తాయి.
- అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్: ఎక్కువ భాగం ఈక్విటీలలో పెట్టుబడి పెడతాయి.
కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్: ఎక్కువ శాతం డెట్‌లో పెట్టుబడి పెట్టే హైబ్రిడ్ ఫండ్స్.
4. ఇండెక్స్ ఫండ్స్ (Index Funds)
ఇండెక్స్ ఫండ్లు ఒక నిర్దిష్ట మార్కెట్ ఇండెక్స్ (Ex.: Nifty 50, Sensex) ని అనుకరిస్తూ పెట్టుబడి పెడతాయి. ఇవి యాక్టివ్ మేనేజ్మెంట్ కాకుండా ప్యాసివ్ మేనేజ్మెంట్ పైన ఆధారపడతాయి, కాబట్టి కాంపారిటివ్గా తక్కువ ఎక్స్‌పెన్స్ రేషియో ఉంటాయి.
5. మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్
మనీ మార్కెట్ ఫండ్స్ అధిక లిక్విడిటీతో కూడిన, షార్ట్-టర్మ్ ఆస్తులలో పెట్టుబడి పెడతాయి, ఇలాంటి ఆస్తులు అందులో చిన్న వ్యవధిలో సులభంగా చెల్లించబడతాయి. వీటి రిస్క్ తక్కువ, కానీ రాబడి కూడా తక్కువ ఉంటుంది.
6. ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్
ఈ ఫండ్స్ ఇతర దేశాల స్టాక్స్‌లో పెట్టుబడి పెడతాయి. మీ పెట్టుబడిని గ్లోబల్‌గా విస్తరించాలనుకుంటే వీటిని ఎంచుకోవచ్చు.
7. గిల్ట్ ఫండ్స్
గిల్ట్ ఫండ్స్ ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెడతాయి, అవి ప్రభుత్వాల ఆధీనం మీద ఉన్నవి కాబట్టి రిస్క్ తక్కువగా ఉంటుంది. వీటిలో పెట్టుబడి చేయడం వల్ల స్థిరమైన ఆదాయం అందుతుంది మరియు ముఖ్యంగా రిటైర్మెంట్ ప్లాన్‌ల కోసం అనుకూలంగా ఉంటుంది.
8. ఇటిఎఫ్ (ETF) ఫండ్స్
ఇటిఎఫ్‌లు స్టాక్ ఎక్స్చేంజ్‌లలో ట్రేడయ్యే ఫండ్లు. ఇవి ఇండెక్స్ ఫండ్లతో సమానమైనవే కానీ స్టాక్‌ల్లాగా ట్రేడవుతాయి.
మీకు ఏ మ్యూచువల్ ఫండ్ సరిపోతుంది?
మీ పెట్టుబడి లక్ష్యాలు, రిస్క్ తీసుకునే సామర్థ్యం మరియు సమయానుకూలతను బట్టి, పై కేటగిరీలలో ఒకటి లేదా ఎక్కువ ఫండ్లను ఎంపిక చేసుకోవచ్చు. ఉదాహరణకు, దీర్ఘకాలిక పెట్టుబడి మరియు ఎక్కువ రాబడి లక్ష్యంగా ఉంటే ఈక్విటీ ఫండ్లు సరైనవి. అదే షార్ట్ టర్మ్ పెట్టుబడి కోసం డెట్ ఫండ్లు అనువైనవి.
- తక్కువ రిస్క్ కోరుకునేవాళ్లు → లిక్విడ్ ఫండ్స్, డెట్ ఫండ్స్.
- మధ్యస్థ రిస్క్, స్థిరమైన లాభాలు కోరుకునేవాళ్లు → హైబ్రిడ్ ఫండ్స్.
- అధిక రాబడి, ఎక్కువ రిస్క్ తీసుకోవాలనుకునేవాళ్లు → ఈక్విటీ ఫండ్స్.
- టాక్స్ సేవింగ్ కోరుకునేవాళ్లు → ELSS ఫండ్స్.
- గ్లోబల్ పెట్టుబడులు కోరుకునేవాళ్లు → ఇంటర్నేషనల్ ఫండ్స్.
మ్యూచువల్ ఫండ్ ఎంచుకునే ముందు కొన్ని ముఖ్యమైన టిప్స్
- మీ పెట్టుబడి లక్ష్యం ఏంటి? – మీరు దీర్ఘకాలిక పెట్టుబడి కోసం వెతుకుతున్నారా లేక తక్కువ కాలానికి?
- రిస్క్ స్థాయిని అంచనా వేయండి – మీరు నష్టాలను తట్టుకునే స్థితిలో ఉన్నారా?
- ఫండ్ పనితీరును విశ్లేషించండి – గత రికార్డులు, మార్కెట్ ట్రెండ్‌లు, ఫండ్ మేనేజర్ అనుభవం చూడండి.
- ఎక్స్పెన్స్ రేషియో చెక్ చేయండి – ఫండ్స్ నిర్వహణ ఖర్చులను గుర్తించండి.
- SIP ద్వారా పెట్టుబడి పెట్టండి – ఒకేసారి పెద్ద మొత్తం పెట్టుబడి పెట్టే బదులు, నెలనెలా పెట్టుబడి పెడితే రిస్క్ తక్కువ అవుతుంది.
చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా పెద్ద మొత్తంగా ఎలా పెంచుకోవచ్చు!
చిన్న మొత్తాలను పెట్టుబడి పెట్టడం అంటే మ్యూచువల్ ఫండ్ SIP (Systematic Investment Plan) క్రమంగా Compounding ద్వారా పెంచుకోవడం. ప్రతినెలా కొంత మొత్తం పెట్టుబడి పెడితే, దీని మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ (సూక్ష్మ వడ్డీ) పని చేస్తుంది. దీర్ఘకాలంలో ఇది పెద్ద మొత్తంగా మారుతుంది. ముఖ్యంగా, మార్కెట్ అప్ & డౌన్‌ను పట్టించుకోకుండా క్రమంగా పెట్టుబడి పెడితే, “రూ. 100 పెట్టుబడి చేస్తే రూ. 200 కావడం” వంటి ప్రభావం కనిపిస్తుంది. ఇది కేవలం సరైన ఫండ్ ఎంపిక, స్థిరమైన పెట్టుబడి, లాంగ్ టర్మ్ విజన్‌పై ఆధారపడి ఉంటుంది.
Mutual Funds సాధారణంగా సగటున 12% – 15% రాబడి ఇస్తాయి. అంటే మీరు నెలకు రూ. 2,500 SIP ద్వారా 15 సంవత్సరాలు పెట్టుబడి పెడితే ఎంత అవుతుంది అనేది కింద పట్టిక ద్వారా అర్థం చేసుకోవచ్చు.
రూ. 2,500 SIP ద్వారా సంపాదన లెక్క (10% – 15% Returns)
కాల వ్యవధి | మొత్తం పెట్టుబడి | 12% రాబడి కలిపి (Approx) | 15% రాబడి కలిపి (Approx) |
5 సంII లు | ₹1,50,000 | ₹2,08,000 | ₹2,27,000 |
10 సంII లు | ₹3,00,000 | ₹5,80,000 | ₹6,98,000 |
15 సంII లు | ₹4,50,000 | ₹12,10,000 | ₹15,70,000 |
20 సంII లు | ₹6,00,000 | ₹23,40,000 | ₹32,00,000 |
(రాబడి, మార్కెట్ స్థితిగతులను బట్టి మారవచ్చు)
ముగింపు
మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మీ పొదుపును సరైన మార్గంలో పెట్టుబడి పెట్టవచ్చు. మీకు సరైన ఫండ్ ఎంపిక చేసుకుంటే దీర్ఘకాలికంగా ఆర్థిక స్వేచ్ఛ పొందవచ్చు. అందుకే, సమర్థంగా ప్లాన్ చేసుకుని, పెట్టుబడి పెట్టండి!
గమనిక: Mutual Funds పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి.