మీరు మీ కుమార్తె భవిష్యత్తు గురుంచి ఆలోచిస్తుంటే కనుక మీకు సుకన్య సమృద్ధి యోజన (SSY) కచ్చితంగా ఒక మంచి ఆప్షన్.
ఈ పథకం, మీ పాప భవిష్యత్తుకు కొండంత అండగా ఉంటుంది. భారతదేశంలో ఆడ పిల్లల భవిష్యత్తు కోసం ఆర్థిక భద్రతను కల్పించే అనేక ప్రభుత్వ పథకాలలో సుకన్య సమృద్ధి యోజన (SSY) ఒక ప్రముఖ పథకం. ఈ పథకం 2015 జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ గారు ‘బేటీ బచావో, బేటీ పదావో’ (కూతురిని రక్షించండి, కూతురిని చదివించండి) అభియాన్త్రం లో భాగంగా ప్రారంభించారు. ఈ పథకం చిన్నారి ఆడ పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది మరియు వారి భవిష్యత్తు అవసరాలకు ఆర్థిక భద్రతను కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం.
సుకన్య సమృద్ధి యోజన పిల్లల భవిష్యత్తు కోసం అద్భుతమైన పొదుపు పథకంగా పేరు పొందింది. ఈ పథకం చిన్నారి కూతుళ్ళ భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టడం మరియు ఆర్థిక భద్రతను కల్పించడం ద్వారా తల్లిదండ్రులు మరియు కూతుళ్ళకు పెద్ద ఉపశమనం కల్పిస్తుంది. ఈ పథకం ద్వారా తల్లిదండ్రులు తమ కూతుళ్ళ చదువు మరియు వివాహం కోసం పెట్టుబడులు పెట్టి, ఆర్థిక సహాయం పొందవచ్చు.
ఇలాంటి ఇతర పథకాలతో పోలిస్తే ఇందులోనే అత్యధికంగా వడ్డీ రేటు సంవత్సరానికి 7.6% నుండి 8.2% వడ్డీ వరకు పొందవచ్చు. ఆడపిల్ల తల్లితండ్రులు లేదా చట్టపరమైన సంరక్షలు ఈ ఖాతాను తెరవచ్చు. ఇక ఈ పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
- సుకన్య సమృద్ధి యోజన ఖాతా పోస్ట్ ఆఫీసుల్లో లేదా అనుమతినిచ్చిన వాణిజ్య బ్యాంకుల ద్వారా తెరవవచ్చు.
- ఖాతా ప్రారంభం కాలం నుండి 21 సంవత్సరాలు లేదా కూతురు వివాహం జరిగినపుడు (ఏది ముందు జరిగీతే అది) వరకు ఇది చెల్లుతుంది.
- వడ్డీ రేటు: సుకన్య సమృద్ధి యోజనకు ప్రస్తుత వడ్డీ రేటు సంవత్సరానికి 7.6% (2024 జూలై – సెప్టెంబర్ త్రైమాసికం).
ఈ పథకం ద్వారా తల్లిదండ్రులు లేదా కాపాడేవారు ప్రతి సంవత్సరం కనీసం రూ. 250 మరియు గరిష్టంగా రూ. 1.5 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. ఈ డిపాజిట్లు 15 సంవత్సరాల పాటు పెట్టాలి, 21 సంవత్సరాలు మెచ్యూర్ సమయం లేదా కూతురు వివాహం వరకు చేయవచ్చు. కానీ మీ పాప 2 నుండి 5 సంవత్సరాల లోపు ఉన్నపుడే ఈ పథకం మొదలుపెట్టడం తెలివైన పని అని చెప్పొచ్చు. ఎందుకంటే ఉదా.. మీ కుమార్తె కు 3 సంవత్సరాలు ఉన్నపుడు ఈ పథకం మొదలు పెడితే మెచ్యూర్ కాలం 21 ఏళ్ళు కలిపి 24 ఏళ్లకు ఈ పథకం లోని మొత్తం మీ కుమార్తె పై చదువులకి కానీ లేదా వివాహం కి కానీ ఉపయోగపడుతుంది. అయితే, ద్రవ్యోల్బణం కారణంగా మేచ్యూరిటీ సమయంలో వచ్చే మొత్తం ఆమె ఉన్నత విద్య ఫీజులను పూర్తిగా కవర్ చేయకపోవచ్చు.
అర్హతలు
- పిల్లల వయస్సు: ఈ పథకంలో ఖాతాను తెరువడానికి మీ కూతురు వయస్సు 10 సంవత్సరాల కంటే తక్కువగా ఉండాలి.
- పిల్లల సంఖ్య: ప్రతి కుటుంబం కనీసం ఒక ఖాతా మరియు అత్యధికంగా రెండు ఖాతాలను తెరవవచ్చు. (జన్మించిన పిల్లలు జంటగా ఉంటే మినహాయింపు ఉంది)
అవసరమయ్యే పత్రాలు
- పుట్టిన సర్టిఫికెట్: పుట్టిన సర్టిఫికేట్ లేదా మరే అధికారిక పత్రం.
- తల్లిదండ్రుల ఐడి ప్రూఫ్: ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్‌పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్.
- తల్లిదండ్రుల అడ్రెస్ ప్రూఫ్: ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్‌పోర్ట్, లేదా విద్యుత్ బిల్లు.
- పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు: రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు.
ప్రయోజనాలు
- పన్ను రాయితీ: ఆదాయం పన్ను చట్టం సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు మినహాయింపు పొందవచ్చు. మెచ్యూరిటీ సమయంలో వచ్చే మొత్తంపై ఎటువంటి పన్ను విధించబడదు.
- నిర్ధిష్ట రిటర్న్స్: వడ్డీ రేటు మార్కెట్ లో ఉన్న ఇతర పథకాల కంటే ఎక్కువగా ఉంటుంది.
- భద్రత: ప్రభుత్వ పథకం కాబట్టి, పెట్టుబడి భద్రతగా ఉంటుంది.
- పూర్తి మోనిటరీ ఫ్లెక్సిబిలిటీ: ఖాతాదారులు రూ. 250 నుండి రూ. 1.5 లక్షల వరకు సంవత్సరానికి ఇన్వెస్ట్ చేయవచ్చు.
- పూర్తి మేచ్యూరిటీ : మేచ్యూరిటీ సమయంలో మీ కుమార్తె అన్ని డిపాజిట్లు మరియు వడ్డీతో మొత్తం డబ్బును పొందుతుంది.
మేచ్యూరిటీ ఉదాహరణలు
- ఉదా 1: రమ్య అనే అమ్మాయి తల్లిదండ్రులు 2015 లో సుకన్య సమృద్ధి ఖాతా తెరిచారు మరియు ప్రతి సంవత్సరం రూ. 10,000 ఇన్వెస్ట్ చేసారు. రమ్య 2036లో 21 సంవత్సరాల వయస్సు వచ్చినపుడు, వారు పొందే మొత్తం సుమారు రూ. 6 లక్షలు.
- ఉదా 2: లావణ్య అనే అమ్మాయి తల్లిదండ్రులు 2018 లో ఖాతా ప్రారంభించి, ప్రతి సంవత్సరం రూ. 20,000 ఇన్వెస్ట్ చేసారు. లావణ్య 2039 లో మేచ్యూరిటీ పొందినప్పుడు, సుమారు రూ. 13 లక్షలు పొందగలరు.
- ఉదా 3: శ్రావ్య అనే అమ్మాయి తల్లిదండ్రులు 2020 లో ఖాతా ప్రారంభించి, నెలకు రూ. 10 వేలు చొప్పున ప్రతి సంవత్సరం రూ.1.20 లక్షలు ఇన్వెస్ట్ చేసారు. శ్రావ్య 2041 లో మేచ్యూరిటీ పొందినప్పుడు, సుమారు రూ. 55.84 లక్షలు పొందగలరు. అంటే వడ్డీ రూపంలోనే రూ. 37.84 లక్షలు పొందవచ్చు.
- అదే నెలకు రూ. 12,500 చొప్పున ఏడాదికి గరిష్ట మొత్తం రూ.1,50,000 చొప్పున డిపాజిట్ చేస్తే సుమారుగా 70 లక్షల వరకు పొందవచ్చు. అందుకే చిన్న వయసులోనే లేదా పుట్టగానే అయినా ఈ పథకం మొదలు పెట్టడం తెలివైన పని అని గుర్తుంచుకోవాలి. అప్పుడు పాపకు 20-25 ఏళ్ల లోపే లక్షల్లో డబ్బు పొందుతుంది.
దరఖాస్తు విధానం
పోస్ట్ ఆఫీస్ లేదా అనుమతినిచ్చిన వాణిజ్య బ్యాంకులలో సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరవడానికి అవసరమైన ఫారం పొందండి. ఈ ఫారం ను అవసరమైన వివరాలతో నింపి మరియు కావాల్సిన పత్రాలు పుట్టిన సర్టిఫికెట్, తల్లిదండ్రుల ఐడి మరియు అడ్రెస్ ప్రూఫ్, ఫోటోలు సమర్పించండి. ప్రారంభ డిపాజిట్ మొత్తాన్ని చెల్లించండి. అన్ని వివరాలు మరియు పత్రాలు సరైనవి అని రుజువు అయిన తర్వాత ఖాతా తెరవబడుతుంది.
మరిన్ని ముఖ్యమైన వివరాలు
SSY పథకం యొక్క వడ్డీ రేటు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, ప్రస్తుతం 7.6 % (2024 జూలై – సెప్టెంబర్ త్రైమాసికం). ఇది ప్రతి త్రైమాసికం మారుతూ ఉంటుంది కానీ ఇది సాధారణంగా ఇతర చిన్న పొదుపు పథకాల కంటే ఎక్కువగా ఉంటుంది. మొదటి 14 సంవత్సరాల పాటు ఈ ఖాతాలో డిపాజిట్లు చేయవచ్చు మరియు ఖాతా 21 సంవత్సరాల తరువాత లేదా కూతురు వివాహం జరిగినప్పుడు (ఎవరైనా ముందు జరిగినది) పూర్తిగా మేచ్యూరిటీ అవుతుంది. ఖాతా 21 సంవత్సరాల తరువాత వడ్డీ చెల్లింపులు నిలిపివేయబడతాయి.
ఖాతా పూర్తి పరిణతి సమయానికి, మొత్తం డిపాజిట్లు మరియు వాటి వడ్డీ మొత్తం కలిసి సరియైన మొత్తం సమకూర్చబడుతుంది. మేచ్యూరిటీ సమయంలో మీరు డబ్బును ఉపసంహరించుకోవడానికి కొన్ని పత్రాలు మరియు ఖాతాదారుల అర్హతను నిర్ధారించే పత్రాలు సమర్పించాలి. SSY పథకం కూతురి చదువు మరియు వివాహ ఖర్చులకు సహాయం చేస్తుంది. ఒక వ్యక్తి తన కూతురు ఖాతా నుండి 18 సంవత్సరాల తరువాత 50% వరకు డిపాజిట్లు ఉపసంహరించుకోవచ్చు. ఈ డబ్బును కూతురు విద్యకు లేదా వివాహ ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు.
మొత్తంగా, సుకన్య సమృద్ధి యోజన పట్ల భారతదేశ ప్రజలు సానుకూల అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు, ముఖ్యంగా చిన్నారుల తల్లిదండ్రులు. అధిక వడ్డీ రేటు, పన్ను లాభాలు, మరియు అమ్మాయి పిల్లల భవిష్యత్తు కోసం భద్రతా పెట్టుబడి మార్గం కలగలిపి ఇది అనేక తల్లిదండ్రులకు ప్రాధాన్యత కలిగిన ఎంపికగా మారింది. ప్రభుత్వ భరోసా మరియు అధిక వడ్డీతో లభించే సుకన్య సమృద్ధి యోజన పథకం అనేది మీ కూతురి భవిష్యత్తు కోసం మంచి ఆర్థిక పునాది. ఈ పథకం ద్వారా కూతురు చదువు మరియు వివాహం కోసం చక్కని పొదుపు సాధించవచ్చు. ఆర్థిక భద్రతను కల్పించడానికి ఈ పథకంలో ఖాతా తెరవడం ఉత్తమ నిర్ణయం అయినప్పటికీ మ్యూచువల్ ఫండ్స్ (ఈక్విటీ) లో పెట్టుబడులు పెట్టడం మంచి ఆలోచన. ఎందుకంటే గడిచిన కాలంలో అనేక సంక్షోభాలలో కూడా మ్యూచువల్ ఫండ్స్ 12% నుండి 15% వరకు రాబడిని అందించాయి. అదే విధంగా ELSS ఫండ్స్ ను ఎందుకంటే అదే విధమైన రాబడులతో పాటు పన్ను ఆదా కూడా చేయవచ్చు.
ఇక్కడ అందించిన సమాచారం సాధారణ జ్ఞానం మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే, మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం అని తెలియజేయడమైనది.