కొత్త సంవత్సరం ప్రారంభంలో మనకు ఎన్నో ఆశలు, ఆకాంక్షలు ఉంటాయి. కొత్త ఆర్థిక ప్రణాళికలు, పెట్టుబడులు, ఖర్చులపై నియంత్రణ, బడ్జెట్ నిర్వహణ వంటి విషయాలపై దృష్టి పెట్టడం చాలా అవసరం. అయితే, మనం చాలాసార్లు కొన్ని సాధారణ తప్పులను చేస్తూ, ఆర్థిక నష్టాలను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ఈ కొత్త సంవత్సరంలో ఆర్థిక ప్రణాళికలను మెరుగుపరచడం, నష్టాలను నివారించడం కోసం కొన్ని ముఖ్యమైన సూచనలు అందిస్తున్నాం. ఈ సూచనలు పాటించడం ద్వారా మీ ఆర్థిక స్థితి మెరుగుపరచుకోవచ్చు.
కొన్ని సాధారణ తప్పులను చేస్తూ మనం ఆర్థిక నష్టాలను అనుభవిస్తుంటాం. ఈ తప్పులను ఎలాంటి రీతిలో నివారించవచ్చో, దాన్ని ఎలా సరిచేయాలో ఈ వ్యాసంలో తెలుసుకుందాం.
1) ఎందుకు పొదుపు చేస్తున్నాం?
పొదుపు అనగానే చాలా మంది పన్ను ప్రయోజనాలు పొందే మార్గాల కోసమే అన్వేషిస్తుంటారు. లేదంటే ఎక్కువ రిటర్నులు ఆశించి పెట్టుబడులు పెడుతుంటారు. ఏళ్ల తరబడి ఉద్యోగం చేస్తున్నవారు లేదా ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నవారు సైతం కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఆర్థిక విషయాల్లో తెలివైన వారైతే ఈ పొరపాట్లు చేయరు. ఆదాయపు పన్ను మినహాయింపులు పొందడం కోసం కొంత వరకు బీమా, ఇతర పన్ను ఆదా పెట్టుబడి సాధనాల్లో పెట్టుబడి పెట్టడం మంచిదే అయినప్పటికీ… మన పెట్టుబడులకు ఒక లక్ష్యం ఉంటే అది ప్రతిఫలం ఇస్తుంది. లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు సంతృప్తిను ఇస్తుంది. కాబట్టి ఈ కొత్త ఏడాది ప్రారంభంలోనే మీ లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. అదీ సాధించగలిగే లక్ష్యమై ఉండాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోని ముందుకు సాగుతూ విజయాన్ని చేరుకొండి.
2) బీమా(Insurance) విషయంలో తప్పులు చేయకండి!
జీవిత బీమా పట్ల ఒకప్పటితో పోలిస్తే ఇప్పటి తరానికి అవగాహన పెరిగిన మాట వాస్తవం. కానీ కొంత మంది చూద్దాంలే, చేద్దాంలే అంటూ తప్పించుకుంటూ ఉంటారు. మరికొందరు జీవిత బీమా కోసం వెచ్చించే మొత్తం తిరిగి రావాలని కోరుకునే వారు ఉన్నారు. వాస్తవానికి మనపై ఆధారపడే కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు టర్మ్ బీమా పాలసీ తీసుకోవడం తెలివైన నిర్ణయం. మన వయసు, ఆదాయం, కెరీర్ కుటుంబ సభ్యుల అవసరాలు వంటివి పరిగణనలోకి తీసుకుని అందుకు తగ్గట్లుగా టర్మ్ బీమా పాలసీని తీసుకోవాలి. అలాగని తక్కువ ప్రీమియం కోసం తక్కువ మొత్తం ఎంచుకోవడమూ సరికాదు. కాబట్టి మీ అవసరాలు, చెల్లించగలే స్తోమతను బట్టి టర్మ్ బీమా పాలసీ తీసుకోండి.
3) ఆరోగ్య బీమా ప్లాన్
ఆరోగ్య బీమా పథకాలతో మీరు మరియు మీ కుటుంబ సభ్యులు ఊహించని వైద్య ఖర్చుల నుండి రక్షించబడతారు, తద్వారా మీరు మనశ్శాంతిని పొందవచ్చు. ఆరోగ్య బీమా ప్లాన్‌లు డాక్టర్ సందర్శనలు, ఆసుపత్రి బసలు, ప్రిస్క్రిప్షన్ మందులు మరియు మరిన్నింటికి సమగ్ర కవరేజీని అందిస్తాయి. అంతేకాకుండా, నెట్‌వర్క్ ఆసుపత్రిలో ఎటువంటి రుసుము చెల్లించకుండా మీకు అవసరమైనప్పుడు నాణ్యమైన చికిత్సను పొందవచ్చు. మీ ఆదాయానికి అనుకూలంగా వ్యక్తిగత ఆరోగ్య భీమా లేదా ఫామిలీహెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవటానికి ప్రయత్నించండి.
4) 50-30-20 రూల్ పాటిస్తున్నారా?
మీరు చేసే ఉద్యోగానికి నెలకు లక్ష వస్తోంది అనుకోండి, వచ్చే ఏడాది ఓ 10 శాతం ఇంక్రిమెంట్. ఒకవేళ కంపెనీ మారితే 80 శాతం హైక్ అనుకుంటే నెలకు రూ.1.80 లక్షలు వేతనం వస్తుంది. ఇంకేం లైఫ్ బిందాస్!”.. అంతేగా… అంతేగా… అనుకుంటే పొరపాటు. చాలా మంది యువత ఆలోచనలు ఇలానే ఉంటున్నాయి. వచ్చే ఏడాది పెరగబోయే వేతనాన్ని కూడా అంచనా కట్టి గాల్లో మేడలు కట్టేస్తుంటారు కానీ పెరగబోయే ఖర్చులని మాత్రం అంచనా వేయరు. జీతం పెరిగాక చూద్దాంలే అనే తీరుతో ముందుకు సాగిపోతూ పొదుపు పక్కన పెడుతుంటారు. భవిష్యత్తులో పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు. అందుకే ఎప్పుడూ ప్రస్తుత జీతాన్నే పరిగణనలోకి తీసుకోవాలి. ఇందులో 50-30-20 సూత్రాన్ని నిత్యం పాటించాలి. మనం సంపాదించేదాంట్లో 50 శాతం అద్దెలు, కిరాణా, కరెంటు, మొబైల్ వంటి బిల్లు చెల్లింపులు అవసరాలకు వినియోగించాలి. తదుపరి 30 శాతం కోరికలు, సరదాలు వంటివాటికి వినియోగించొచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ మిగిలిన 20 శాతం మొత్తాన్ని పొదుపు పెట్టుబడుల కోసం వినియోగించాలన్నవిషయం గుర్తుంచుకోవాలి. మికు భవిష్యత్తులో ఆర్ధికంగా అండగా ఉండేది పొదుపే.
5) విలాసాలకు పోకుంటేనే మేలు…
అప్పులు చేసి తిప్పలు తెచ్చుకోకుండా ఉండటమే మేలు. చాలా మందికి చిన్నప్పటి నుంచి తీరని కోరికలు ఉంటాయి. కొంతమంది ఉద్యోగం రాగానే వచ్చే జీతంతో ఆ కోరికలను తీర్చుకుంటూ ఉంటారు. కలలను సాకారం చేసుకోవడం మంచిదే అయినా అది విలాసాలకు దారితీయకుండా ఉంటే మంచిది. ఈఎంఐలు కట్టగలిగే స్తోమత ఉన్నంత మాత్రాన విలాసాలకు పోతే అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఖర్చులు పరిమితితో ఉండేలా చూసుకోవడం మంచిది.
6) అత్యవసర పరిస్థితుల్లో డబ్బు ఎలా?
పైన చెప్పినట్లు పరిస్థితులన్నీ ఎప్పుడూ ఒకేలా ఉండవు. పైగా అవసరాలు చెప్పిరావు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. కరోనా వంటి క్లిష్ట సమయంలోనూ, మాంద్యం భయాల నేపథ్యంలోనూ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఎదురైనా ఎలాంటి ఇబ్బందీ లేకుండా నిత్య జీవితం ఒడుదొడుకులకు లోను కాకుండా ఉండాలంటే కనీసం 4 నుంచి 8 నెలల జీతం మన అత్యవసర నిధిలో ఉండేలా ప్లాన్ చేసుకొని ముందస్తు ప్రణాళికతో సిద్దమగా ఉండండి.
7) క్రెడిట్ కార్డు వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారా?
ప్రస్తుత రోజుల్లో క్రెడిట్ కార్డు పొందడం చాలా ఈజీ. అందువల్ల దాదాపు అందరి వద్ద క్రెడిట్‌కార్డులు ఉంటున్నాయి. లిమిట్ కూడా కొందరికి వేలల్లో అయితే మరి కొందరికి లక్షల్లో ఉంటోంది. ఏదైనా అత్యవసరం అయినప్పుడు ఈ లిమిట్ మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది. సరిగ్గా వాడుకుంటే క్రెడిట్‌కార్డు అప్తమిత్రుడిలా పనిచేస్తుంది. ఒకవేళ ఆఫర్ల మోజు, క్యాష్‌బ్యాక్‌ల క్రేజ్‌లో చిక్కుకుంటే మాత్రం తడిసి మోపెడవుతుంది. ఒక్కసారి ఈ క్రెడిట్ కార్డు అప్పు చెల్లించడానికి మరో అప్పు చేయాల్సి వచ్చి అప్పుల ఊబిలో చిక్కుకుంటే దాని నుండి బయటపడడం అంత సులువు కాదు. చాలా మంది ఈ క్రెడిట్‌కార్డుల మీద నియంత్రణ లేక రద్దు చేసుకుంటు ఉంటారు. కాబట్టి కొత్త ఏడాదిలో క్రెడిట్‌కార్డుపై మీ పట్టు పెంచుకోండి. తెలివిగా వాడండి.
గతంలో ఈ పొరపాట్లు చేసి ఉంటే వాటిని సరిదిద్దుకుని ఈ నూతన సంవత్సరంలో నూతనంగా ఆలోచించి ఆర్ధిక స్వేచ్ఛను పొందండి.